వినాయక నిమజ్జన కార్యక్రమం కొరకు పూర్తిస్థాయి ఏర్పాట్లు
సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా
ఉద్యమ కెరటం, కాగజ్ నగర్ :
వినాయక చవితి సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి పూర్తి స్థాయికి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. గురువారం జిల్లాలోని కాగజ్ నగర్ ప్రిన్సిపల్ పరిధిలోని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే పెద్దవాగు ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, సి. ఐ. లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసుకునే విధంగా అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని, నిమజ్జన ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఓల్డ్ కాలనీ, సర్ సిల్క్ కాలనీలలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలను సందర్శించారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించాలని, వైద్య శిబిరాలకు వచ్చిన ప్రజలలో అనుమానితులకు రక్త పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్స అందించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కొరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లారీ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వసతి గృహ పరిసరాలు, రిజిస్టర్ లను పరిశీలించి అధికారులకు, ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comment List